లక్ష ఇందిరమ్మ ఇండ్లకు భూములు సేకరిస్తున్నం: మంత్రి పొన్నం ప్రభాకర్  

లక్ష ఇందిరమ్మ ఇండ్లకు భూములు సేకరిస్తున్నం: మంత్రి పొన్నం ప్రభాకర్  
  • త్వరలో సొంత జాగా ఉన్న హైదరాబాదీలకు ఇండ్లు మంజూరు: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో దశల వారీగా నిర్మించనున్న లక్ష ఇందిరమ్మ ఇండ్ల కోసం భూములు సేకరిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌‌‌‌లో సొంత జాగా ఉన్న అర్హులకు ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. మంగళవారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గోషామహల్, ముషీరాబాద్, ఎల్‌‌‌‌బీనగర్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 1,920 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఎమ్మెల్యే రాజాసింగ్‌‌‌‌తో కలిసి ఈ-లాటరీ నిర్వహించారు.

ప్రతి నియోజకవర్గానికి 5,500 ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లో ప్రభుత్వ భూముల కొరత ఉన్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వందల కోట్ల విలువైన భూములను పేదల ఇండ్ల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.

ఎక్కువ ఇండ్లు నిర్మించండి..

పేదలు ఏ నియోజకవర్గంలో ఉంటే అక్కడే వారికి ఇండ్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తన నియోజకవర్గంలో గృహ నిర్మాణాలకు అనువైన మరిన్ని భూములను గుర్తించామని, వాటిలోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని కోరారు. బుధవారం మాప్‌‌‌‌అప్ లాటరీ..ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఇండ్ల కేటాయింపు పూర్తయింది. వివిధ కారణాలతో ఆగిపోయిన 14 నియోజకవర్గాల్లో సుమారు 1,700 ఇండ్లను బుధవారం మాప్‌‌‌‌అప్ లాటరీ ద్వారా కేటాయించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హుల జాబితా నుంచే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ-లాటరీ ప్రక్రియను https://youtube.com/@tghd.official యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చని హౌసింగ్ బోర్డు పేర్కొంది.